మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు అని అందరికీ తెలిసినా మందుబాబుల తీరు మాత్రం మారడంలేదు. మద్యం మత్తులో ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి వీరంగం సృష్టించాడు. అతివేగంతో కారును ఢీకొట్టి మూడు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురు చాకచక్యంగా బయటకు దూకేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పార్థాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రీతానీ ప్రాంతంలో కారు డ్రైవర్ యూటర్న్ తీసుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కు.. కారును ఢీకొట్టింది. అప్పటికు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ట్రక్కు డ్రైవర్.. కారును అలాగే ముందుకు ఈడ్చుకెళ్లిపోయాడు. మూడు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఓ డంపర్ను ఢీకొట్టడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. అంతకు ముందు కారులోని నలుగురు బయటకు దూకేయడంతో వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే, ప్రమాదంలో కారు టైర్లు ఊడిపోయాయి.
ట్రక్కును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి తమ వాహనాన్ని ఢీకొట్టాడని కారు యజమాని అనిల్ కుమార్ ఆరోపించాడు. తాము కేకలు వేస్తున్నా ట్రక్కును ఆపకుండా ఈడ్చుకెళ్లిపోయాడని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఈ భారీ ట్రక్కుకు 22 టైర్లు ఉన్నాయి. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. డ్రైవర్‌ను వెంబడించి పట్టుకున్నారు. మద్యం మత్తులోనే ఇలా చేసినట్టు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మంసూరీ-లావర్ రహదారిపై ఓ గుర్రపు బగ్గీని ట్రక్కు ఢీకొని ముగ్గురు చనిపోయిన ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఇది జరిగింది.
పెళ్లి ఊరేగింపు ముగించుకుని గుర్రపు బగ్గీలో తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు, గుర్రం అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రమాదం తర్వాత ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అతడ్ని గుర్తించే పనిలో ఉన్నట్టు మీరట్ ఎస్పీ తెలిపారు.