టర్కీ, సిరియాలో భూకంపం సృష్టించిన విలయం ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. భూకంపం సంభవించి ఇప్పటికే వారం గడవడం, గడ్డకట్టే చలి కావడంతో తమ వారి ప్రాణాలపై కుటుంబసభ్యులు ఆశలు వదులుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 35 వేలు దాటింది.
మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతుండటంతో సామూహిక ఖననం చేస్తున్నారు. టర్కీలోని మరాష్ ప్రాంతంలో ఆదివారం నాటికి దాదాపు 5 వేల మృతదేహాలను ఒకే ప్రాంతంలో సమాధి చేశారు. అక్కడ శవాలను మోసుకొచ్చే వాహనాల శబ్దం నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంది. తమ వారికి అంత్యక్రియలు జరిపించేందుకు వచ్చినవారి రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది.
సమాధులను తవ్వేందుకు బుల్డోజర్లు, పొక్లెయిన్లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. శ్మశానవాటిక కోసం పైన్ అడవులను కొట్టివేశారు. మరోవైపు.. మళ్లీ మళ్లీ చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు వణుకు పుట్టిస్తున్నాయి. మరాష్‌కు సమీపంలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది.