గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో అద్భుతమైన సేవలు అందించిన జంగారెడ్డిగూడెం ఏరియా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు కనీస వసతులు లేక దైన్య స్థితిలో ఉండటం అత్యంత బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 మండలాల్లో ఉన్న పేద ప్రజలకు అనారోగ్యం వస్తే వారికి సంజీవనిలా ఈ ప్రభుత్వ ఆసుపత్రి పనిచేస్తుందని, అలాంటి ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో సరైన సేవలు అందక ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని శేషు అన్నారు. గత ప్రభుత్వ కృషితో వచ్చిన ఎక్సరే విభాగం నేడు సిబ్బంది లేక మూత పడిందన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దానిపై దృష్టి పెట్టిన పరిస్థితి లేకపోవడం అత్యంత బాధాకరం అని, రక్త పరీక్ష విభాగంలో కూడా అదే రకమైన పరిస్థితి సరైన పరికరాలు లేకపోవడం, మందులు లేకపోవడంతో సమస్యల లేనితో 100 పడకల ఆసుపత్రి కొట్టుమిట్టాడుతోంది ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి వెంటనే సిబ్బందిని నియమించాలని శేషు డిమాండ్ చేశారు.