చిత్తూరు జిల్లా, నగరి సీఐ వాసంతి అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన టీడీపీ నేతలపై బూతులు ప్రయోగించారు. సీఐ వాసంతి తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి రోజాకు నిన్న (మంగళవారం) సాయంత్రం చీర, గాజులు సారెగా ఇవ్వటానికి వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో జడ్జి వద్ద హాజరు పర్చగా ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కాగా మంత్రి రోజాకు సారె ఇచ్చేందుకు తెలుగు మహిళలు మంగళవారం నగరిలోని ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తొలుత వచ్చిన సుమారు 20 మందిని మంత్రి ఇంటి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు తరిమేశారు. తర్వాత మంత్రి ఇంటి వెనుక వైపు నుంచి చీర, సారె పెట్టడానికి వచ్చిన టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మీర, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తారంటూ పోలీసుల వాహనాన్ని మహిళలు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఇంటికి వెళ్లే హక్కు లేదా అంటూ తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి లక్ష్మీప్రసన్న తదితరులు ప్రశ్నించారు.