ఎలాంటి అనుమానాలు అవసరం లేదు... మూడు రాజధానులు పక్కా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే జగన్ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడిన సజ్జల.. మూడు రాజధానులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని.. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని.. అమరావతిలో అసెంబ్లీ ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
'రియల్ ఎస్టేట్ కోసం కొందరు వింత వాదనలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు. ఎన్నికల కోసం మేం రాజకీయం చేయబోం. ఎన్నికలు ఉంటే ఒకమాట, లేదంటే మరో మాట చెప్పం. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా? వచ్చిన అవకాశాన్ని వదులుకుని చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు గగ్గోలు పెట్టడం ఎందుకు' అని సజ్జల ప్రశ్నించారు.
మంగళవారం బెంగళూరులో రాజధానుల అంశంపై మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏపీ రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది' అని బుగ్గన స్పష్టం చేశారు.
'విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం అలాంటిది. ఓడరేవు నగరంగా ఇప్పటికే గుర్తింపు ఉంది. కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. అందుకే విశాఖను రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. కర్ణాటకలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు బెలగావిలో జరుగుతాయి. ఇందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే. అదే తరహాలో మన అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్ గుంటూరులో జరుగుతాయి. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది' అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.