ఏపీ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు.. హైకోర్టులో ఊరట లభించింది. వేతనాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన నేతలకు.. ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు, బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలను విరుద్ధమని.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ.. షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని సూర్యనారాయణ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ను కలిసే హక్కు అందరికీ ఉంటుందని.. దీనికి షొకాజ్ నోటీసు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని వినియోగించకుండా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. 12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని.. ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని.. గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. దీనిపైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని.. అదే ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం ఏంటని ప్రభుత్వం ప్రశ్నించింది.