దేశంలోని బీబీసీ కార్యాలయాల్లో వరుసగా మూడో రోజూ ఐటీ అధికారులు సర్వేలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో సర్వేలు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు సర్వేలను నిర్వహించడానికి తమకు అనుమతి ఉందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. దాదాపు 60 గంటలపాటు సోదాలు నిర్వహించగా.. ఇవి ఇంకా కొనసాగడం గమనార్హం. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ‘సర్వే’లు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నా.. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన కొద్ది రోజుల్లోనే ఈ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ బీబీసీ ఆఫీసులోని కనీసం పది మంది సీనియర్ ఉద్యోగులు గత రెండు రోజుల నుంచి ఇళ్లకు వెళ్లలేదని, ఐటీ అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముంబై శాంతాక్రజ్ ప్రాంతంలోని బీబీసీ ఆఫీసులో ఐటీ అధికారులు చాలాసేపు ఆ సంస్థ ఖాతాలను తనిఖీ చేశారు. ఇక తదుపరి నోటీసు ఇచ్చేంతవరకు బీబీసీ ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని ఆదేశించారు. కేవలం పది మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయంలో ఉండమని చెప్పి, మిగతావారిని పంపేశారు.
పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బీబీసీకి తాము గతంలోనే నోటీసులు జారీ చేశామని, కానీ వాటిని ఆ సంస్థ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తమకు సహకరించలేదన్న ఐటీ సిబ్బంది.. వచ్చిన లాభాలను ఇతర సంస్థలకు మళ్లించిందని వారు ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుని స్కాన్ చేస్తున్నారు. గురువారం ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన సిబ్బందిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు.
బుధవారం నాటి సర్వే సందర్భంగా కొంతమంది ఉద్యోగులను ఎంపిక చేసి వారి నుంచి ఎలెక్ట్రానిక్ లేదా డాక్యుమెంట్లలో ఉన్న ఫైనాన్షియల్ డేటాను సేకరించారు. ఈ డేటాకు సంబంధించిన లావాదేవీలపై వారిని ఆరా తీస్తున్నారు. ఉద్యోగులనుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను వారికి తిరిగి ఇచ్చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారాని బ్రిటిష్ ప్రభుత్వ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ఇదిలావుంటే ఈ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మోదీపై డాక్యుమెంటరీ రూపొందించడంతోనే కక్షసాధింపు రాజకీయాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబడుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని తీవ్రంగా ఖండించిన కేంద్రం.. ఇదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది.