చెడు సంప్రదాయం ఎప్పటికైనా అనర్థాలకు దారితీస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ భయంకర హత్యోదంతం మరిచిపోక ముందే అటువంటి మరో ఘటన ప్రేమికుల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. ఫార్మసీ విద్యార్ధిని నిక్కీ యాదవ్‌ను ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ హత్యచేసి, ఆమె శవాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసి.. మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన సాహిల్‌ను.. నిక్కీ నిలదీయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కోచింగ్ సెంటర్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇరువురూ కొన్నేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. తీరా మరో యువతితో ప్రియుడు పెళ్లి పీటలు ఎక్కుతుండటాన్ని నిక్కీ నిలదీసింది.
నిశ్చితార్థం కూడా జరిగిపోయి.. ఫిబ్రవరి 10న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాడు. దీనిపై ప్రశ్నించిన నిక్కీ.. సాహిల్‌తో గొడవపడింది. దీంతో ఆమె అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుని.. శుక్రవారం తెల్లవారుజామున ప్రియురాలిని బయటకు తీసుకెళ్లి మొబైల్ ఫోన్ ఛార్జర్ వైరుతో ఉరేసి చంపేశారు. ఆమెతో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లి ఉంటే అక్కడే నిక్కీని హత్యచేసి ఉండేవాడని పోలీసులు తెలిపారు. నిక్కీకి ఫిబ్రవరి 10న గోవాకు టిక్కెట్టు బుక్ అయ్యింది కానీ అతడికి టిక్కెట్టు దొరకలేదు. అందుకే ఇద్దరూ ఆనంద్ విహార్ సమీపంలో కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
నైరుతి ఢిల్లీలోని మిత్రాన్ గ్రామానికి చెందిన సాహిల్ (24).. నిక్కీ గొంతుకోసి చంపి, ఆమె మృతదేహాన్ని తన దాభాలోని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడు. అనంతరం అదే రోజు పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘సాహిల్ ఉదయం 9 గంటలకు కశ్మీర్ గేట్ చేరుకున్నాడు.. అదే రోజు పెళ్లి కావడంతో అతడి కోసం తల్లి పలుసార్లు ఫోన్ చేసింది. కశ్మీర్ గేట్ వద్దకు కారులో వెళుతుండగా నిక్కీ, సాహిల్ మధ్య గొడవ జరిగి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.. పశ్చిమ విహార్ మీదుగా తన దాబాకు బయలుదేరి మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నాడు.. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, నిక్కీ లగేజ్‌ను అక్కడ పడేశాడు.. తర్వాత 6-8 గంటల్లోనే పెళ్లి చేసుకోవడానికి ఇంటికి వెళ్లాడు’’ అని తెలిపారు.
ఈ ఘటన మూడు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిక్కీతో పాటు వివాహం చేసుకున్న యువతి త్రిష (పేరు మార్చాం), నిందితుడి కుటుంబాన్ని నాశనం చేసింది. హత్య చేసిన తర్వాత కూడా భయం లేకుండా మరో అమ్మాయి మెడలో తాళికట్టి ఆమె జీవితాన్ని అంధకారంలోని నెట్టేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సాహిల్ తల్లిదండ్రులు మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ‘ఫిబ్రవరి 9న నిశ్చితార్థం తర్వాత అర్థరాత్రి సాహిల్ కారులో బయలుదేరడం మేము చూశాం... తన వివాహ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాడని మేము భావించాం’ అని స్థానికుడు చెప్పాడు.