‘యువత.. రాజకీయాల్లోకి రావాలి. పాలిటిక్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు. పోరాటం సాగించాలి. భయపడేకొద్దీ కేసులు పెడతారు. నాపైనే హత్యాయత్నం కేసులూ పెట్టారు. ఏం చేశారు? మీకు అండగా నేనుంటా. యువత ధైరంగా ముందడుగు వేయాలి’ అంటూ నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా 21వ రోజైన గురువారం ఉదయం కేవీబీపురం మండలం రాయపేడులో ఆయన యువతీ యువకులతో సమావేశమయ్యారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అసమర్థ సీఎం, మంత్రి చేతగానితనంతో నూతన పరిశ్రమలు రాక పోగా, ఉన్నవి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. యువత అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్న ఆయన.. వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.