కృష్ణా జిల్లా, నందివాడ, పోలుకొండ గ్రామంలో గురువారం పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ యువకుడి శవంతో ధర్నాకు దిగారు. దోమతోట ఏసుబాబు (19) బుధవారం రాత్రి ఉరివేసుకుని మృతి చెందినట్లు తండ్రి సత్యానందం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏసుబాబు గ్రామంలోని ఎలీషారావు టాటా సుమో అద్దాలను ఇద్దరు యువకులు పగలకొట్టారు. ఎలీషారావు నందివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. గ్రామంలోని యువకుడు వాహనం అద్దాలను తానే పగల గొట్టానని, ఏసుబాబుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వివరణ ఇచ్చాడు. తనకు సంబంధం లేకుండా ఎందుకు తనపై కేసు పెట్టావని ఏసుబాబు ఆ తర్వాత ఎలీషారావును ప్రశ్నించాడు. అది మనసులో పెట్టుకున్న ఎలీషారావు పోలీసులపై ఒత్తిడి తేవడం మొదలెట్టారు. ఏసుబాబు తండ్రి సత్యానందంను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఏసుబాబు వస్తేనే అతడిని వదులుతామని బెదిరించారు. ఈ క్రమంలో ఏసుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ధర్నాను అడ్డుకోకపోగా, సాయంత్రం వరకు ప్రేక్షకపాత్ర వహించారు. సాయంత్రం 6గంటలకు ఏసుబాబు భౌతికకయాన్ని పోస్టుమార్ట నిమిత్తం గుడివాడ ప్రభత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై చిరంజీవిని వివరణ కోరగా, తల్లిదండ్రులు మందలించటం వల్ల ఏసుబాబు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.