ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి పేరు చెప్పి పోలీసులు పాదయాత్రలో టీడీపీ జెండాలను, బ్యానర్లను తొలగిస్తున్నారన్నారు. పాదయాత్రలో భాగంగా స్థానిక నాయకులు చేస్తున్న ఏర్పాట్లపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారన్నారు. రాణిగుంట, కొత్తూరు, తిమ్మసముద్రం, మట్టం, నాలుగవ కండ్రిగ గ్రామాలలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను ఎస్.ఐ సునీల్ నాయకత్వంలో తొలగించారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయన్నారు. పాదయాత్రలో ప్రదర్శిస్తున్న టీడీపీ జెండాలు గాని, ఫ్లెక్సీలు గాని ఎన్నికల నియమావళికి వర్తించవని... పోలీసులు వాటిని తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో టీడీపీ బ్యానర్లు, జెండాలు తొలగించి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించగలరని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.