తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయమని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తారకరత్న ఎప్పుడో చనిపోయారని.. కానీ, చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు చెడ్డ పేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను చంద్రబాబు ఇన్నాళ్లూ దాచారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయ కోసం ఇన్నాళ్లు ఆస్పత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడైనా ఆయన మరణవార్తను ప్రకటించి ఉండాలి కదా అని ఆమె దుయ్యబట్టారు.
ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికే ఈ తండ్రీకొడుకులు అపశకునమని ప్రజలకు తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. నారా కుటుంబం నీచమైన రాజకీయాలు చేయడం ఆపేస్తే, తమ నందమూరి కుటుంబం బాగుపడుతుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.