రెండో దశలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను బారత్ కు తీసుకొచ్చారు, దక్షిణాఫ్రికా అడవుల్లో రాజసంతో ఠీవీగా కూర్చున్న చీతాలు ఇప్పుడు భారత్‌లో సందడి చేసేందుకు వచ్చాయి. భారత వాయుసేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం ‘గ్లోబ్‌మాస్టర్ సీ-17’ దక్షిణాఫ్రికాలోని జోహన్నస్‌బర్గ్ నుంచి 12 చీతాలను తీసుకొని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. మత్తు మందు ఇచ్చిన అనంతరం వీటిని ప్రత్యేక పెట్లెల్లోకి చేర్చి, విమానం ఎక్కించారు. గ్వాలియర్ నుంచి ఈ చీతాలను ప్రత్యేక చాపర్లలో కునో జాతీయ పార్కుకు తరలించారు. సుమారు 74 ఏళ్ల కిందట చీతాలు భారత అడవుల్లో ఠీవీగా తిరిగాయి. వేటాడటం, ఇతర కారణాల వల్ల వీటి జాతి అంతమైంది.
భారత అడవుల్లో చీతాల సంతతిని తిరిగి ప్రవేశపెట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికాతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున కునో నేషనల్ పార్క్‌లో స్వయంగా వీటిని అడవిలోకి విడిచిపెట్టారు.
రెండో దశలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం.. నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచుతారు. ఇందు కోసం కునో జాతీయ పార్కులో 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేశారు. 30 రోజులు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత అడవిలోకి వదిలేస్తారు. ఈ 12 చీతాల్లో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని కునో నేషనల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేయనున్నారు.