చిన్నారి రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిన్నారి రేవతి మరణం తనను తీవ్రంగా బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం తాను పోరాట యాత్ర చేస్తున్న సమయంలో విశాఖపట్నం నగరంలో తనను కలిసిన చిన్నారి రేవతి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ మేరకు ఆదివారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగుకూడా నడవలేని స్థితిలో ఉండేదని.. నాలుగేళ్ల క్రితం ఆ చిన్నారి తనను కలిసే నాటికి ఏడెనిమిదేళ్ల వయసు ఉంటుందన్నారు.
అలాంటి అనారోగ్య స్థితిలో చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం తనను అబ్బురపరిచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొన్ని భక్తి గీతాలు కూడా తన ఎదుట ఆలపించి ఆశ్చర్యపరిచిందన్నారు. చిన్నారి రేవతి తాను ఇచ్చిన 3 చక్రాల బ్యాటరీ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లేదని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి తాను చాలా ఆనందించానని తెలిపారు. ఇలాంటి గొప్ప ప్రతిభ ఉన్న చిన్నారి వ్యాధి కారణంగా 12 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
తుదిశ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్న వీడియో తన మనసును కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్నారి రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టమని డాక్టర్లు చెప్పినా.. 12 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.