ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండోసారి విచారణకు రమ్మందంటే విషయం కొంచెం సీరియస్‌గా ఉన్నట్లేనని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఆయన పై విధంగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
వివేకా హత్య కేసులో విచారణ ఓ క్రమం ప్రకారం జరుగుతోందని.. 24న అవినాష్ రెడ్డి ఖచ్చితంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. లేకపోతే సీబీఐ దీన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరు కావాలని సీబీఐ తమ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఈ కేసుకు సంబంధించి జనవరి 28న అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే, విచారణ జరిగిన 20 రోజుల్లోనే అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.