ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమరపాటు..పూర్తిగా చూపును చంపేసింది

national |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 12:47 PM

మనం చేసే కొన్ని పొరపాట్లు...ఎమరపాటు తనం మన జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. ఇదిలావుంటే కళ్లద్దాల స్థానంలో కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. కళ్లలో ఫిక్స్ చేసి ఉండే ఈ కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, కళ్లకే ప్రమాదం. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఇలాగే తన చూపు కోల్పోయాడు. కాంటాక్ట్ లెన్స్ తీయకుండా నిద్రించడం అతడి జీవితంలో చీకటి నింపింది. భయంకరమైన ఓ పరాన్నజీవి అతడి కంటిని పూర్తిగా తినేసింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతడే స్వయంగా వివరించాడు. తీవ్ర విషాదంలోనూ తనలా మరొకరు ఆ తప్పు చేయోద్దంటూ సందేశం అందించాడు. అసలేం జరిగింది?


అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన క్రుమ్‌హోజ్ (21 ఏళ్లు) అనే యువకుడు గత 8 ఏళ్లుగా కాంటాక్ట్‌ లెన్స్‌ వాడుతున్నాడు. తరచూ వాటిని తీయకుండానే నిద్రపోయేవాడు. కొంతకాలంగా అతడి కళ్లు గులాబీ రంగులోకి మారడం, దురద పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. కానీ, దాన్ని అతడు సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత ఒక రోజు కాంటాక్ట్ లెన్స్‌ పెట్టుకున్నా ఏమీ కనిపించలేదు. వెంటనే వైద్యుడి వద్దకు పరుగెత్తాడు.


క్రుమ్‌హోజ్‌ను పరీక్షించిన వైద్యులు అతడి కంటిలో హెచ్‌ఎస్‌వీ1 వైరస్‌ ఉందని చెప్పారు. చికిత్స అందించినా ఫలితం లేదు. ఐదుగురు కంటి వైద్య నిపుణులు, ఇద్దరు కార్నియా నిపుణులను సంప్రదించిన తర్వాత అది వైరస్‌ కాదని, భయంకరమైన పరాన్నజీవి అని తేలింది. ఆ తర్వాత సర్జరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆ పరాన్న జీవి అతడి కంటిని పూర్తిగా తినేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను అతడు షేర్ చేశాడు.


గత నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫండ్ రైజింగ్ కోసం ‘GoFundMe page’లో వివరాలు పెట్టాడు. ‘కొన్నిసార్లు పడుకొని నిద్ర లేచిన తర్వాత కుడి కన్ను కాస్త దురదగా అనిపించేంది. గులాబీ రంగులోకి మారేది. ఐదారుగురు డాక్టర్లను సంప్రదించిన తర్వాత కంట్లో ప్రమాదకరమైన అకంతమొయిబా కెరటైటిస్‌ పరాన్నజీవి ఉన్నట్లు తేలింది. అవి కంటి మొత్తాన్ని తినేశాయి. ఫలితంగా పూర్తిగా చూపు కోల్పోయా’ అని అతడు రాసుకొచ్చాడు.


‘కాంటాక్ట్‌ లెన్స్‌ ఉపయోగించే వారంతా జాగ్రత్తగా ఉండండి. నిద్రపోయేటప్పుడు, స్నానం చేస్తున్న సమయంలో కచ్చితంగా వాటిని తీసేయండి’ అంటూ 21 ఏళ్ల క్రూజ్ సూచిస్తున్నాడు. గోఫండ్ మీ పేజీ ద్వారా అతడు 10 వేల డాలర్లు సమీకరించడం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు వెయ్యి డాలర్లు పోగయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com