చరిత్రాత్మక పోరాటంలో ప్రజాస్వామ్య ప్రపంచం విజయం సాధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆకాంక్షించారు. అమెరికా- ఉక్రెయిన్ సంబంధాల చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టమని అన్నారు. తమ ఇరువురి మధ్య నేడు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెప్పారు. ఈ పర్యటన ఫలితాలు యుద్ధక్షేత్రంలో కచ్చితంగా ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలుస్తోన్న అమెరికాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బైడెన్‌తో అన్నారు.
ఇదిలావుంటే యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. రష్యా దండయాత్ర చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు కీవ్ లో పర్యటించారు. ఐదు గంటల పాటు అక్కడ పర్యటించిన జో బైడెన్.. ఉక్రెయిన్‌లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ చాలా బలహీనంగా ఉందని.. పశ్చిమ దేశాలు ఐకమత్యంగా లేవని భావించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొన్నారు.
‘దాదాపు ఏడాది కిందట పుతిన్ తన దండయాత్రను ప్రారంభించినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనంగా ఉందని, పశ్చిమ దేశాలు కలిసికట్టుగా లేవని భావించారు. మమ్మల్ని అధిగమించవచ్చని అనుకున్నారు.. కానీ, ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి.. ఉక్రెయిన్ ప్రజలు సామాన్యులు.. కష్టపడేతత్వం ఉన్నవారు. సైన్యంలో ఎప్పుడూ శిక్షణ పొందలేదు.. కానీ, యుద్ధంలో వారు ముందుకు సాగిన విధానం వీరోచితమైంది’ అని జో బైడెన్ కొనియాడారు. కీవ్ నా హృదయంలో కొంత భాగాన్ని ఆక్రమించిందని అన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు అండగా నిలిచామని.. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతోందని స్పష్టం చేశారు.
రష్యా సేనలను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు గగనతల నిఘా రాడార్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను అందజేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను ఉక్రెయిన్‌లో ఆరుసార్లు పర్యటించినట్టు గుర్తుచేసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరో 500 మిలియన్ డాలర్ల అదనపు సాయం ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో జో బైడెన్ పర్యటనను ఎవరూ ఊహించలేదు. ఈ విషయంలో ఉక్రెయిన్ సైతం గుంభనంగా వ్యవహరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొదట అమెరికా నుంచి విమానంలో పోలాండ్‌కు చేరుకున్న బైడెన్.. అక్కడి సరిహద్దు నుంచి రాత్రివేళ రైలు మార్గంలో కీవ్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. జెలెన్‌స్కీ, బైడెన్ కలుసుకున్నప్పుడు.. కీవ్ నగరమంతటా సైరన్లు మోగించారు. అయితే, అత్యంత సన్నిహితులకు మాత్రం బైడెన్ ఆదివారమే వాషింగ్టన్ నుంచి బయలుదేరినట్టు తెలిసింది. శ్వేతసౌధం షెడ్యూల్‌లో కూడా అధ్యక్షుడు రాజధానిలోనే ఉన్నట్టు చూపడం గమనార్హం.
ఉక్రెయిన్‌లోకి బైడెన్ ప్రవేశించడానికి కొద్ది గంటల ముందు మాత్రమే రష్యాకు ఈ విషయం చేరవేసినట్టు అమెరికా అధికారులు తెలిపారు. అయితే, జో పర్యటన సమయంలో వైమానిక దాడి సైరన్‌లు మోగించినప్పుడు ఒక్క క్షణం ఉత్కంఠ నెలకుంది. బెలారస్‌లో రష్యా మిగ్ -31 ఫైటర్ జెట్ ల్యాండింగ్ అయినట్టు గుర్తించారు. అందులో కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణి అమర్చి ఉందని, దానిని కూల్చే సామర్థ్యం ఉక్రెయిన్‌కు లేదని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రతినిధి కైవ్‌లో విలేకరులతో చెప్పారు.