మాతృభాషకు ఈ ఏడాది యూనెస్కో పెద్దపీట వేసింది. మాతృభాష పేరిట ఈ ఏడాది పొడువునా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న ఏ ప్రాణికి లేని సౌలభ్యం మనిషికి మాత్రమే సొంతం. తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. తన మనసులోని అభిప్రాయాలు, భావాలను వ్యక్తం చేయడానికి నోటి ద్వారా చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష. మనిషి పుట్టుకతో నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల.. ఎవరూ చెప్పకుండానే తన తల్లిని అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది.
అమ్మ మాటే మాతృభాష.. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు. అయితే వాటి ప్రభావంతో మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు.. అమ్మభాషను పరిరక్షించుకోవాలి. అమ్మ పలుకులోని ఆప్యాయత అనురాగం మరెక్కడా దొరకవు. మనిషి తాను ప్రపంచంలో అన్ని చోట్ల జయించాలంటే తన మాతృభాషను గౌరవించాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
మనస్సులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషలో ఉంది. అందుకే మహనీయులంతా తొలుత మాతృభాషను నేర్చుకొన్నవారే. బాల్యం నుంచి మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, అప్పుడే మనిషి సంపూర్ణతను సాధిస్తాడని భాషాభిమానులు, సాహితీవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి తన మాతృభాషలో మాట్లాడినపుడు సంతృప్తి కలుగుతుంది.
1956లో అప్పటి తూర్పు పాకిస్థాన్.. నేటి బంగ్లాదేశ్‌లో యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృ భాష బెంగాలీలోనే బోధించాలని ఉద్యమించారు. ఫలితంగా హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మాతృ భాష కోసం వారు చేసిన త్యాగం ఫలితంగా 1999 ఫిబ్రవరి 21 నుంచి ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఆ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా దినోత్సవంగా జరుపుకుటున్నారు. ప్రపంచంలో మొత్తం ఆరు వేల భాషలు ఉండగా, భారత దేశంలో 1,652 మాతృభాషలు ఉన్నాయి. వీటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. 200 భాషలకు 1600 పైగా మాండలికాలున్నాయి.
మాతృభాష అంతరించి పోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో మాతృభాష అంతర్భాగమని స్పష్టం చేసింది. కనీసం 30 శాతం మంది పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే మాతృభాష ఉనికి కోల్పోయే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 57 అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు ఉన్న తెలుగు ..ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్ద మాతృభాషగా గుర్తింపు పొందింది. హిందీ తరువాత తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేళ ఏటా ఒక ముఖ్యమైన అంశాన్ని యునెస్కో తీసుకుంటోంది. ‘బహుభాషా విద్య.. విద్యను మార్చడానికి ఒక ఆవశ్యకత’ అనేది ఈ ఏడాది థీమ్. ఇది స్వదేశీ ప్రజల విద్య, భాషలను నొక్కి చెబుతుంది. పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెమినార్లు, వర్క్‌షాప్ జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో దీనిని నిర్వహిస్తోంది.