కొడుకు కంటే కూతురుకే తండ్రిపై ప్రేమ ఎక్కువ అంటారు. దీనికి అద్దంపట్టే ఘటన ఇది. కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోన్న తన తండ్రికి అవయవదానం చేయడానికి ముందుకొచ్చిన బాలికకు వయసు ఆటంకంగా మారింది. దీంతో తండ్రి ప్రాణాలు కాపాడుకోడానికి ఆమె న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకుంది. తండ్రికి లివర్ దానం చేసి.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా గుర్తింపు పొందింది కేరళకు చెందిన 17 ఏళ్ల ఇంటర్ బాలిక దేవానంద. తండ్రి కోసం ఆమె చేసిన సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. దేశంలో 18 ఏళ్లలోపు వ్యక్తులు అవయవదానానికి అనర్హులు కావడంతో దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దీర్ఘకాల కాలేయ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి ప్రతీష్‌కు అవయవదానానికి అనుమతించాలని కోరింది.
త్రిసూర్‌లోని అలువకు చెందిన ప్రతీష్ (48) స్థానికంగా ఓ కేఫ్‌ను నడుపుతున్నారు. అయితే, ఆయన కాలేయ సంబంధిత అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. దానికి కేన్సర్ కూడా తోడువ్వటంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో అవయవ దాతల కోసం కుటుంబసభ్యులు వెదికినా ఫలితం లేకపోయింది. చివరకు తన కాలేయాన్ని తండ్రికి ఇవ్వాలని ఇంటర్ చదువుతోన్న ఆయన కుమార్తె దేవానంద నిర్ణయించుకుంది. కానీ, మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం.. మైనర్లు అవయవాలను దానం చేయడానికి అంగీకరించదు.
ఆమె అన్ని అవకాశాలను అన్వేషించి, ఇలాంటి కేసులో మైనర్‌ను అవయవ దానం చేయడానికి కోర్టు అనుమతించిందని గుర్తించిన తర్వాత కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినందుకు దేవానందను మెచ్చుకున్న కోర్టు.. తండ్రికి అవయవ దానానికి అనుమతించింది. కోర్టు అనుమతితో తండ్రికి లివర్ దానం చేసింది. ఫిబ్రవరి 9న రాజాగిరి ఆస్పత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను చేశారు. దేవానంద సాహాసాన్ని అభినందిస్తూ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ఆస్పత్రే భరించింది. వారం రోజుల తర్వాత దేవానందను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తండ్రికి కాలేయం దానం చేయడం చాలా గర్వంగా.. ఆనందంగా ఉంది.. ఏంతో ఉపశమనం కలిగింది అని వ్యాఖ్యానించింది. కాలేయం దానం కోసం తన ఆహారంలో తీవ్రమైన మార్పులు చేసినట్టు తెలిపింది. లివర్ అనుకూలంగా ఉందని నిర్ధారించుకోవడానికి సాధారణ వ్యాయామాలతో స్థానిక జిమ్‌లో చేరినట్టు చెప్పింది.