యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. మంగళవారం నుంచి మార్చి 3వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంభూ నరసింహుడు. కొలువైన ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న స్వస్తివాచనంతో మొదలై మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఈ నెల 22న ధ్వజారోహణం, 27న ఎదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు.