తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం 300 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించనుంది. గత శుక్రవారం(పాదయాత్ర 22వ రోజు) రాత్రి బసకు చేరేసరికి లోకేశ్ మొత్తం 296.6 కిలోమీటర్ల దూరం నడిచారు. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజు సాయంత్రం నందమూరి తారకరత్న మృతి చెందడంతో లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. తారకరత్న మరణం నేపథ్యంలో ఆది, సోమవారాలు కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు. మంగళవారం(23వ రోజు పాదయాత్ర) శ్రీకాళహస్తి పట్టణ శివార్లలోని క్యాంపు సైట్ నుంచి 3.4 కిలోమీటర్లు నడిస్తే 300 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించినట్టవుతుంది.