వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతికి రాముడు లేకపోవచ్చు కానీ లక్ష్మణుడి లాంటి జగన్ ఉన్నాడంటూ పీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. ఇదిలావుంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె వయసును కూడా పరిగణనలోని తీసుకోకుండా.. ఓ యువకుడు చేసిన ఆరోపణలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న లక్ష్మీ పార్వతి అప్పట్లోనే డీజీపీ కలిసి ఫిర్యాదు చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లు తన నుంచి ఎలాంటి వివరణ లేకుండా ప్రసారం చేశాయని.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆమె వాపోయారు. ఈ వ్యవహారంపై ఎపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మరోసారి స్పందించారు. లక్ష్మీ పార్వతిని వెలయాలిని చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘70 ఏళ్ల వయసున్న ఎన్టీ రామారావు భార్య.. 30 ఏళ్ల అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుందా..? లక్ష్మీ పార్వతిని వెలయాలిని చేశారు. కొందరు మీడియా పెద్దలు కలిసి ఆమెను అడవుల్లో పడేశారు. ఆమెకు రాముడు లేకపోవచ్చు కానీ లక్ష్మణుడి లాంటి జగన్ ఆమె వెంట ఉన్నాడు. ఆమెకు రెండు పూటలా అన్నం పెడుతున్నాడు. ఆమె గౌరవంగా బతికేలా చేస్తున్నాడు. రామారావును బయటకు నెట్టినా.. ఆయన కుటుంబం ఏమీ మాట్లాడలేదు. ఆయన భార్యను తిడుతున్నా రామారావు కుటుంబం ఏమీ మాట్లాడదు. కానీ చంద్రబాబు భార్యను ఏమనకున్నా సరే గుంపులుగా బయటకొచ్చారు’’ అని పోసాని ఆరోపించారు.
‘ది గ్రేట్ ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి గురించి తప్పుగా ఎలా ప్రసారం చేశారు..? రామారావు తనకు భార్య లేదని.. బాగోగులు చూసుకునే వాళ్లు లేరని లక్ష్మీ పార్వతిని చేసుకున్నాడు. వీళ్లకేంటి బాధ’ అని పోసాని ప్రశ్నించారు. ‘‘ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణకు భార్య ఉంది. అయనప్పటికీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తిని లక్ష్మీ పార్వతిలాగే అనగలరా..? తారక్ మిమ్మల్ని ముక్కలుగా నరుకుతాడు. వాడు ఈ రోజు నంబర్ 1 కాబట్టి.. వాడి దెబ్బకు భయపడి.. ఎన్టీఆర్ అమ్మగారిని మహాతల్లి అంటున్నారు. ఎన్టీఆర్ తల్లి మహాతల్లి అయినప్పుడు.. ఎన్టీఆర్ భార్య మహాతల్లి కాదా..?’’ అని పోసాని నిలదీశారు.
‘‘జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ వాంటెడ్ పర్సన్. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాగలడు. వాణ్ని లాగేసుకుంటే.. వాడితో మంచి మాటలు చెప్పించుకుంటే మనకు ఓట్లు పడతాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏమీ అనరు. కానీ లక్ష్మీ పార్వతికి ఎవరూ లేరు కదా. అందుకే తిరుగుబోతు అంటూ.. ఓ మహిళను ఏమైనా అంటారు. వీళ్లు జరల్నిస్టులా శాడిస్టులా..?’’ అంటూ లక్ష్మీపార్వతి వ్యవహారంలో రాద్దాంతం చేసిన మీడియా పెద్దలపై పోసాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.