ప్రకృతి, అందులోని జీవుల శక్తిని గమనిస్తే.. మానవుడి శక్తి చాలా చిన్నది. వైరల్ అవుతున్న ఈ గద్ద వీడియోను చూస్తే.. ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. సముద్రపు నీటి లోపల ఉన్న చేపను గద్ద తన్నుకుపోయిన విధానం అబ్బురపరుస్తోంది. ఆ వీడియోను చిత్రీకరించిన విధానమూ అద్భుతంగా ఉంది. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్‌లో ఓ గద్ద తన శక్తినంతా కూడదీసుకొని నీటిలో నుంచి క్రమంగా బయటకు వస్తుండటం కనిపిస్తుంది. తొలుత గద్ద ముక్కు, రెక్కలు బయటకి వస్తాయి. ఆ తర్వాత కాళ్లు కనిపిస్తాయి. చివరగా కాళ్ల మధ్యలో భారీ చేప ఉంటుంది.
ఒక జీవిది ఆకలి. మరో జీవిది బతికేందుకు పోరాటం. నీటిలో చేపకు చాలా బలం ఉంటుంది. అయినా, పట్టు విడవని గద్ద తన బలంతో దాన్ని ఓడించి పైకి ఎగరేసుకొని వచ్చింది. తన కాలి గోళ్లతో చేపను ఒడిసి పట్టుకొని, శరీరాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నీటి ఉపరితలానికి చేరుకుంది. ఆ తర్వాత కూడా కాళ్ల మధ్య చేప కదులుతుంటే.. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే పైకి ఎగిరి వెళ్లిపోతోంది.
ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. గద్ద శక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రకృతి సృష్టితో మానవులు ఎప్పటికీ సరిపోలరు, పోటీపడరు. రాప్టర్స్ (Eagle / Hawk / Falcon) వేగం, లక్ష్యం, దాడి చేసి వెళ్లిపోయే తీరు అద్భుతం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
ఆకాశంలో వేగంగా ఎగిరే గద్దలు.. నీటి ఉపరితలం కింద ఉండే చేపలు, ఇతర జీవులను ఆకాశం నుంచే గమనిస్తాయి. వాటి కళ్లు చాలా షార్ప్‌గా పనిచేస్తాయి. అందుకే ‘డేగ కళ్లు’ అంటారు. అదే వేగంతో దూసుకొచ్చి నీటి ఉపరితలంపై ఉండే చేపలను కాలి గోళ్లతో కరుచుకొని అంతే వేగంతో ఎగిరిపోతాయి.