జగన్ నిబద్ధతతో పథకాలను అందిస్తున్నారని. వైఎస్సార్సీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ వెల్లడించారు. వాటి వల్ల జగన్‌ను ప్రజలు మరోసారి ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు ఏడాదికి రూ.50-60 వేలు కుటుంబానికి వస్తున్నాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏడాది లక్ష రూపాయలు వస్తాయి. అది ప్రజల హక్కు’ అని పోసాని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలపైనా పోసాని ఘాటుగా స్పందించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌ను డెవలప్ చేయడం లేదు సరే.. మరి చంద్రబాబు ఏం డెవలప్ చేశాడని పోసాని ప్రశ్నించారు. ‘టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్లి చంద్రన్న నీకు జయము అనే భజన.. మాటలు, లంచాలు, గొడవలు, జైలుకు పంపించడాలు తప్పితే ఏమీ చేయలేదన్నారు. సాధారణ ప్రజానీకానికి కడుపు నింపి.. మంచి బట్టలు ఇచ్చి.. చదువులు చెప్పి.. ఆ తర్వాత అభివృద్ధి సంగతి చూడొచ్చ’ని పోసాని అభిప్రాయపడ్డారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. అభివృద్ధి పనులు చేపడతారని పోసాని తెలిపారు. జగన్ నిజాయతీపరుడైన ముఖ్యమంత్రి అని తెలిస్తే.. గుజరాత్‌కు ఎలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారో.. మన దగ్గరకు కూడా అలాగే పారిశ్రామికవేత్తలు తరలి వస్తారన్నారు. మనకు విశాఖలాంటి నగరం ఉంది. విశాల కోస్తా తీరం ఉంది. నాయకుడు మంచి వాడైతే ఎవడైనా ఇష్టపడతాడని పోసాని వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలు మీడియా ద్వారా జనాలను ముఖ్యంగా గ్రామీణ మహిళలను ప్రభావితం చేయలేవని పోసాని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ‘‘మన దేశంలో పల్లెటూళ్లలో చాలా మంది ఆడవాళ్లు పేపర్లు చూడరు. ఖాళీ సమయాల్లో సీరియళ్లు చూస్తారు. రాజకీయాలను వాళ్లు పట్టించుకోరు. జగన్ అన్ని వర్గాల ప్రజలందరికీ వసతులు కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇస్తున్నార’’ని పోసాని తెలిపారు.
జగన్‌ది నా కులం కాదు.. నా ప్రాంతం కాదు.. కానీ ఆయన యాటిట్యూడ్ నాకు నచ్చిందన్న పోసాని.. చంద్రబాబు పార్టీలో చేరడం ఇష్టలేకపోయినా గర్భిణి అయిన తన కూతురు అడగడంతో రామారావు చేర్చుకున్నారన్నారు. ‘జగన్ బాగా పనిచేయకపోతే ఆయనకు ఓటేయకండి. కానీ చంద్రబాబుకు మాత్రం ఓటేయకండి. చంద్రబాబే కావాలంటే మన కమ్మ కులాన్ని ఎవడూ కాపాడలేడు’ అని పోసాని వ్యాఖ్యానించారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చంద్రబాబు, రామోజీ రావు మాట్లాడుకున్నారని రామోజీ రైట్ హ్యాండ్ అయిన పాండు రంగా రావు నాతో చెప్పారు. అమరావతి వద్ద భూములు కొనుగోలు చేయమని పాండు రంగారావు నాకు చెప్పారు. కానీ నేను కొనుగోలు చేయనని బదులిచ్చానన్నారు.