దేనికైనా రాసిపెట్టివుండాలంటారు. రాసివుంటే మనం ఏం చేయకపోయినా పదవులు వెతుక్కుంటూ వస్తాయి. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గర్నవర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో మహిళా నేతకు మాత్రం వరుసగా మూడోసారి అవకాశం దక్కడం విశేషం. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతకు మూడోసారి పదవి దక్కింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సునీత 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత.. మరో మూడేళ్లు సమయం ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. అయితే 2021 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పదవీకాలం 2023 మార్చితో ముగియనుండగా.. మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఈసారి సునీతకు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారన్నారు పోతుల సునీత. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వంగా నిరూపించారన్నారు. బీసీలకు అందించిన సామాజిక న్యాయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బీసీలంతా వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. ఇప్పుడు ఇంతమందికి పదవులు కల్పించడం చారిత్రాత్మకమని. బీసీలకు చేసిన న్యాయాన్ని గుర్తించాలన్నారు సునీత. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అఖండ మెజారీటీతో గెలిపించి.. మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేలా అందరూ కృషి చేయాలన్నారు.
పోతుల సునీత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఆమంచి చేతిలో ఓడారు. కొద్ది రోజులకు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు... దీంతో సునీతతో విభేదాలు మొదలయ్యాయి. చంద్రబాబు ఈ విభేదాలకు చెక్ పెట్టేందుకు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే ఆమంచి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరగా.. సునీత టీడీపీలో ఉన్నారు.
2019 ఎన్నికల తర్వాత పోతుల సునీత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి శాసన మండలిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అనంతరం సీఎం జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు.. కొద్దిరోజులకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ పదవీ కాలం పూర్తికాగా మూడోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది. అలాగే చీరాల నియోజకవర్గంలో గ్రూప్ వార్‌కు కూడా పుల్‌స్టాప్ పెట్టారు. అక్కడ వైఎస్సార్‌సీపీలో మూడు వర్గాలు ఉన్నాయనే చర్చ ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పర్చూరు ఇంఛార్జ్‌గా నియమించగా.. పోతుల సునీతకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో చీరాల ఎమ్మెల్యే కరణంకు లైన్ క్లియర్ అయ్యింది.