ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అధికారం వాలంటీర్లకు ఎక్కడిది.. ఏపీ హైకోర్టు ప్రశ్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 11:51 AM

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు.. అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు ఆర్‌ వసంతలక్ష్మి, మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందిన తమను.. రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.. గ్రామస్థాయి లబ్ధిదారులను గతంలో పంచాయతీ కార్యదర్శి గుర్తించేవారని.. ప్రస్తుతం వాలంటీర్లు రాజకీయ కారణాలతో అనర్హులను చేస్తున్నారని పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపించారు.


ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు.. అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిదని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ శాఖలు, అధికారులు ఉన్నప్పుడు.. వాలంటీర్లను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. అసలు వారికి సర్వీసు నిబంధనలు లేవని.. ఆ వ్యవస్థకున్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు. అయితే పథకాల లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్ర లేదని.. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు వాలంటీర్లను వినియోగిస్తున్నామని సెర్ప్‌ సీఈవో అందుకు భిన్నంగా కౌంటర్‌ వేశారు. ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు.


దీంతో వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు సెర్ప్‌ సీఈవో 28న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రధానంగా లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై గ్రామ-వార్డు వాలంటీర్లు-సచివాలయ ప్రత్యేక కమిషనర్‌.. సెర్ప్‌ సీఈవో దాఖలు చేసిన కౌంటర్లలో భిన్న వైఖరులు ఉండటంతో కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com