సాంకేతికత పెరిగాక నేరాలు ఎలా పెరుగుతున్నాయో దొంగలు కూడా అంతే సునాయాసంగా దొరికిపోతున్నారు. ఇదిలావుంటే పక్కా ప్లాన్‌తో క్రైం చేసిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసి పోలీసులకు దొరికిపోతారు. అలాగే.. నగలున్న కారును చోరీ చేసిన శ్రీనివాస్ కూడా.. చిన్న లాజిక్ మిస్సై.. పోలీసులకు చిక్కాడు. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో రూ.7 కోట్ల వజ్రాభరణాలున్న కారుతో ఉడాయించిన డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మాదాపూర్‌లో ఉండే రాధిక అనే మహిళ జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. కారులో ఉన్న రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో ఈ నెల 17న పరారయ్యాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు.. కారు నంబరును అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి గాలింపు చర్యలు చేపట్టారు. కారును కూకట్‌పల్లి సమీపంలో వదిలేసిన శ్రీనివాస్.. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో ఉండే తన బంధువు ఇంటికి వెళ్లాడు. పెట్రోలు ఖర్చుల నిమిత్తం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్ కార్డుతో ఓ కొత్త సెల్‌ఫోన్ కొన్నాడు. కొత్త ఫోను కొని తన బంధువుకిచ్చి.. అతని ఫోన్‌ను శ్రీనివాస్ తీసుకున్నాడు. అక్కడే శ్రీనివాస్ పోలీసులకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ డెబిట్ కార్డు (Debit Card) స్వైపింగే అతన్ని పట్టించింది.
డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా.. పోలీసులు శ్రీనివాస్ బంధువును పట్టుకున్నారు. అయితే.. అప్పటికే శ్రీనివాస్ బస్సులో తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరుకు వెళ్లాడు. అక్కడ నగలను గొయ్యి తీసి పాతిపెట్టాడు. హైదరాబాద్ పోలీస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నగలతో సహా నిందితుడిని అరెస్టు చేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను రాబట్టిన తర్వాత అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక్కడే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతను చోరీ నగలకు ఎటువంటి బిల్లులు.. లెక్కలు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది.