వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదిలావుంటే గన్నవరంలో రాజకీయం గరం గరంగా మారింది. ఒక్క ఘటనతో గన్నవరం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, కారు తగలబెట్టడం, పార్టీ శ్రేణులపై దాడులకు దిగడం ద్వారా అరాచకానికి తెరలేపిన మూకల వెనుక.. ఎమ్మెల్యే వంశీ ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వంశీ డైరక్షన్‌లోనే విధ్వంసం జరిగిందనే విమర్శిస్తున్నారు. అందుకు వంశీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అని చెబుతున్నారు.
టీడీపీ నుంచి గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీ.. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనపై పోటీ చేసి ఓడిన నాయకులు వంశీని ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. ఇటు టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట పట్టాభి గన్నవరంలో తానే పోటీ చేసి.. వంశీకి డిపాజిట్లు రాకుండా తరిమికొడతానని స్పష్టం చేశారు. ఈ సమయంలో.. పట్టాభి దూకుడుకు కళ్లెం వేయడంతోపాటు.. వైసీపీలోని తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చే.. ఉద్దేశంతోనే వల్లభనేని వంశీ ఈ దాడులకు సపోర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. వల్లభనేని వంశీ కీలక కామెంట్స్ చేశారు. హనుమాన్ జంక్షన్‌లో ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడులు ఇంతటితో ఆగుతాయా? అని ఆయన్ని ప్రశ్నించగా... వాటిని తాను మొదలు పెట్టలేదని.. ఎవరో రెచ్చగొడితేనే తన అనుచరులు ఎదురు దాడికి దిగారంటూ వంశీ క్లారిటీ ఇచ్చారు. తనకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. వారు తనతో ఫొటోలూ దిగారని.. సమస్య మొత్తం బయటి నుంచి వచ్చిన నాయకులతోనే అని వంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అక్కడితో ఆగకుండా.. పొలిటికల్ సెటైర్లు వేశారు. 'ఒకప్పుడు తన కారుపై వేలాడిన వారు.. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన వారు.. తనని అక్కడికిరా, ఇక్కడికిరా తేల్చుకుందామంటూ మీడియాలో ఊదరగొడుతున్నారు. నేను ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా గన్నవరం వస్తే చూసుకుందాం. చంద్రబాబు, లోకేష్‌లతో సహా.. ఎవరైనా గన్నవరం వస్తే పోటీకి సిద్ధం' అని వల్లభనేని సవాల్ విసిరారు.