ఇటీవల విమాన ప్రయాణాలు సవాళ్లతో కూడినదిగా మారింది. సాంకేతికలోపంతో ఎయిరిండియా విమానం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి (Delhi) 300 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఒక ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో దారి మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యవసరంగా స్టాక్‌హోమ్ విమానాశ్రయానికి తరలించారని వివరించారు. పైలట్ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ వర్గాలు పెద్ద సంఖ్యలో ఫైరింజన్లను సిద్ధం చేశాయి.
ఆయిల్ లీక్ కావడంతో ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని స్టాక్‌హోంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఇంజిన్ నుంచి ఆయిల్ చిమ్మడం గుర్తించినట్టు పేర్కొన్నారు. విమానం పరిశీలన ఇంకా కొనసాగుతోందని చెప్పారు. పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం కూడా ఎయిరిండియా విమానం ఒకదాన్ని దారిమళ్లించారు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో లండన్‌లో అత్యవసరంగా దిగింది.
ఇదిలావుంటే ఫిబ్రవరి 21 రాత్రి ఢిల్లీ- ముంబయి ఎయిరిండియా విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు, సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉంది. తొలుత రెండున్నర గంటలు ఆలస్యంంగా రాత్రి 10.40కి బయలుదేరుతుందని ప్రకటించారు. కాసేపటి తర్వాత 11.35కి షెడ్యూల్ చేసి చివరకు 1.48 గంటలకు విమానం బయలుదేరింది.
సిబ్బంది ఆలస్యంగా వచ్చారని, అందువల్లే విమానం నిర్ణీత సమయానికి బయలుదేరలేదని అధికారులు ఇచ్చిన వివరణపై ప్రయాణికులు మండిపడ్డారు. కట్టుకథలతో మమ్మల్ని ఫూల్ చేశారని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, పైలట్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురికావడంతోనే విమానం ఆలస్యంగా బయలుదేరినట్టు ఎయిరిండియా ఉద్యోగి ఒకరు తెలిపారు.