విదేశాల్లో మన భారతీయులు వివిధ రంగాలలో రాణించడమే కాదు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇదిలావుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి పోటీకి సై అంటున్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన పోటీ గురించి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ నిక్కీ హేలీ ఎన్నికల్లో పోటీపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఆమె తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారత సంతతి నేత వివేక్.
‘అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను.. ఈ ప్రకటన చేయడం పట్ల గర్వంగా ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం. నేను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. అయితే.. అంతకంటే ముందు అమెరికా అంటే ఏంటో తిరిగి తెలుసుకోవాలి.. అలాగే చైనానుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను’ అని వెల్లడించారు.
‘‘మనం జాతీయ గుర్తింపు సంక్షోభం మధ్యలో ఉన్నాం.. ఇక్కడ మనం చాలా కాలం నుంచి విభేదాలతో గడుపుతున్నాం.. 250 సంవత్సరాల కిందట సాధారణ ఆదర్శాలకు కట్టుబడి ఉన్న అమెరికన్ల సిద్ధాంతాలను, మార్గాలను మరచిపోయాం.. జాతివివక్షత దేశానికి ముప్పు.. నేను ఈ దేశంలో ఆ ఆదర్శాలను పునరుద్ధరించడానికి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని ఈ రాత్రి చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని అన్నారు.
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా రామస్వామి అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. 2014లో రోవాంట్ సైన్సెస్ బయోటెక్ సంస్థను స్థాపించి రామస్వామి.. పలు వ్యాధులకు ఔషధాలను రూపొందించారు. ఎఫ్‌డీఏ అనుమతితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అందుబాటులోకి తెచ్చారు.
లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీని ద్వారా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోన్న కీలక సంస్థల్లోని పౌరుల గొంతుకను వినించేందుకు కృషి చేస్తున్నారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. దీంతో 40 ఏళ్లలోపు వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. నిక్కీ హేలీ, ట్రంప్‌తోపాటు.. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్సే తదితరులు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉండనున్నారు. తాజాగా ఆ జాబితాలో వివేక్ రామస్వామి చేరారు.