కష్టకాలంలో వచ్చి ‘మానవ సేవయే, మాధవ సేవ’ నినాదాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేసిన భారత సైన్యం సేవలను తుర్కియే భూకంప బాధితులు కొనియాడుతున్నారు. భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారత్ సహాయక చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏడు భారీ విమానాల్లో ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలు, సహాయక బృందాలు, జాగిలాలను పంపించింది. మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, భారత సైన్యానికి చెందిన రెండు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం ఓ పారా మెడికో తన ఏడాదిన్నర వయసున్న తన కవల పిల్లలను వదిలిపెట్టి తుర్కీయేకు బయలుదేరింది. అంతేకాదు, ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్కడ వెళ్లే 140 మందిపైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్‌లను సిద్ధం చేసింది ప్రభుత్వం. అక్కడ రెండు వారాల పాటు సేవలందించిన సైన్యం సోమవారం స్వదేశానికి చేరుకుంది.రోజుల తరబడి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు స్నానాలు కూడా చేయలేదు. అయితే, తమ పట్ల భూకంప బాధితులు చూపిన ఆదరాభిమానుల ముందు ఇవన్నీ తమకు కష్టంగా అనిపించలేదని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్‌లో పాల్గొన్న డిప్యూటీ కమాండెంట్ దీపక్ మాట్లాడుతూ.. తుర్కీయే ప్రజలు తమపై ఎనలేని ప్రేమను చూపారని అన్నారు. వారి నుంచి పొందిన ప్రేమ, ఆప్యాయతతో మా హృదయంలో కొంత భాగం నిండిపోయిందన్నారు. అహ్మద్ అనే ఓ బాధితుడు తన భార్య, ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్నా అంతటి దుఃఖంలోనూ తాను ఎక్కడకు వెళ్లిన శాఖాహారాన్ని అందజేసేవాడని తెలిపారు. యాపిల్ లేదా టమోటా ఏ కూయగారయైనా ఉప్పు లేదా స్థానిక మాసాలా దినసులతో చాలా రుచిగా తయారుచేసి తనకు వడ్డించేవాడని చెప్పారు.
152 మంది సభ్యులతో కూడిన ముగ్గురు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఆరు శునకాలు భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ రెస్క్యూ పూర్తిచేసుకుని తిరిగొచ్చేటప్పుడు భావోద్వేగానికి గురయ్యామని వివరించారు. అత్యంత దుర్బలమైన పరిస్థితుల్లోనూ తమ సహాయం చేసిన వారితో
అనుబంధాన్ని పెంచుకున్నామని దీపక్ అన్నారు.
హిందూస్థానీ స్నేహితులు కష్టకాలంలో వచ్చి తమకు సాయం చేశారని కృతజ్ఞతలు చెప్పుకుని, కన్నీళ్లు కార్చిన టర్కీవాసులు.. భారత సైనికుల యూనిఫారమ్‌లపై ఉండే మిలటరీ బ్యాడ్జీలు, చిహ్నాలను గుర్తుగా తీసుకున్నారు. ఫిబ్రవరి 7న ఆపరేషన్ ప్రారంభించిన ఫెడరల్ కంటెజెన్సీ ఫోర్స్.. ఇద్దరు అమ్మాయిల్ని ప్రాణాలతో బయటకు తీసింది. శిథిలాల నుంచి 85 మృతదేహాలను వెలికితీసింది. టర్కీ నుంచి తిరిగొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన అధికారిక నివాసంలో వారిని సత్కరించారు.
‘భారత ప్రభుత్వ సూచనలతో తుర్కియేలో సహాయ చర్యలకు వెళ్లే తమ సిబ్బందికి విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పాస్‌పోర్ట్ వీసా కాన్సులర్ విభాగం రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్‌లు సిద్ధం చేసింది.. నిమిషాల్లో వందలాది డాక్యుమెంట్లను సిద్ధం చేశారు’’ అని ఎన్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ బుండేలా అన్నారు.
విదేశీ విపత్తు పోరాట ఆపరేషన్‌కు మొదటిసారిగా పంపిన ఐదుగురు మహిళల్లో కానిస్టేబుల్ సుష్మా యాదవ్ (32) ఉన్నారు. ఆమె 18 నెలల వయసున్న తన కవల పిల్లలను వదిలేసి వెళ్లారు. తుర్కీయేకు వెళ్లాలని ఆదేశాలు వచ్చిన వెంటనే రెండో ఆలోచన చేయలేదని సుష్మా అన్నారు. ‘ఎందుకంటే మనం చేయకపోతే, ఎవరు చేస్తారు?.. నేను, నా సహోద్యోగి ఇద్దరం పారామెడికోలం... మా సిబ్బందికి పోషకాహారం అందించి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం మా పని.. తద్వారా వారు తుర్కియేలోని మైనస్ 5 కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో అనారోగ్యం బారిన పడకుండా పనిని చేయగలరు’ అని యాదవ్ చెప్పారు.
‘నేను నా కవలలను నా అత్తమామల వద్ద వదిలిపెట్టాను.. ఎక్కువ రోజుల పాటు వారిని విడిచిపెట్టడం ఇదే మొదటిసారి.. కానీ ఆపరేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌కి వెళ్లే సమయంలో తన తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు అయితే నా క్షేమం గురించి తెలుసుకోవాలనే కోరిక చాలా కష్టమైందని సబ్ ఇన్‌స్పెక్టర్ శివాని అగర్వాల్ తెలిపారు. ‘భారత్, టర్కీ మధ్య దాదాపు రెండున్నర గంటల వ్యత్యాసం ఉంటుంది.. కాబట్టి నేను రెస్క్యూ నుంచి వచ్చిన వారికి కాల్ చేసే సమయానికి రాత్రి 11:30 అయ్యేది.. నా ఫోన్ కాల్ కోసం వారు ఎదురుచూస్తూ ఒక్క రింగ్‌కే ఆన్సర్ చేసేవారు’ అగర్వాల్ చెప్పారు.