ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరగలేదు. ఏపీ రాజధానికి సంబంధించిన అంశంపై గురువారం విచారణ జరగాల్సి ఉంది. కానీ, ఈ జాబితాలో అమరావతి అంశం లేకపోవడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది. అయితే.. ఈ విచారణ తిరిగి ఎప్పుడు చేపడుతారన్నది తెలియరాలేదు. అలాగే, గురువారం నాటి విచారణ ఎందుకు వాయిదా పడిందనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలావుంటే ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేసింది. దీన్ని అత్యవసరంగా విచారించాల్సి ఉందని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు. అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు.. కోర్టు అందించిన నోటీసులు గత నెల చివర్లో తమకు అందాయని, కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాలు అవసరమని బదులిచ్చారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కేసును ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. అయితే, గురువారం జరగాల్సిన విచారణ జరగలేదు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశంపై త్వరలోనే సుప్రీం కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవల కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మంత్రులు విశాఖపట్నం నుంచి పరిపాలన చేపట్టనున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడిదారులతో జరిగిన వివిధ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అశంపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా మళ్లీ వాయిదా పడింది.