ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని వార్తలు రాయాలి' అని మీడియాకు మాజీ మంత్రి, మైసీపీ ఎంపీ కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే.. గన్నవరం ఘటనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తప్పుడు వార్తలు రాస్తున్నవారిని కోడాలి నాని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని.. సామాజిక విప్లవానికి తెర తీశారని కొనియాడారు. ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చింది జగనే అన్నారు. అందుకే చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ఆయన విమర్శించారు.
'పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు. గన్నవరంలో పట్టాభి రెచ్చగొట్టేలా మాట్లాడి డ్రామా చేశాడు. క్రరలు, రాళ్లతో దాడి చేసి సీఐ తల పగులగొట్టారు. పథకం ప్రకారం దాడి చేసి సీఐని కొడితే కేసు పెట్టరా.. సీఐ తలకు తొమ్మిది కుట్లు పడి ఐసీయూలో ఉన్నారు. పోలీసులకు కులమతాలు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. పట్టాభిని కొట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. గన్నవరంలో క్రరలు, రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు' అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
'చంద్రబాబు కుట్ర మేరకే దుష్ప్రచారం చేస్తున్నారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించాలనేదే కుట్ర జరుగుతోంది. తాను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. గతంలోనూ ఎన్టీఆర్‌పై కుట్ర చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఎన్టీఆర్‌పై దుష్ప్రచారం చేశారు. ఆనాడు ఎన్టీఆరే పట్టించుకోలేదు. ఇప్పుడు గన్నవరం ఘటనకు సంబంధించి తప్పుడు వార్తలు రాసినట్లే.. ఆనాడు ఎన్టీఆర్‌పై పేజీల మీద పేజీలు వ్యతిరేకంగా వార్తలు రాశారు' అని కొడాలి నాని ఆరోపించారు.
'పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు ప్రచురించి తప్పుడు వార్తలు రాశారు. అన్ని అసత్య కథనాలు, అభూత కల్పనలే. తప్పుడు వార్తలపై కనిపించి కనిపించని రీతిలో సవరణ వేశారు. తప్పుడు వార్తలపై క్షమాపణ చెప్పాలి. లేదంటే మీ కుట్రలు, కుతంత్రాలను ప్రజల ముందు పెడతాం. మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవడానికే కుట్రలు పన్నుతున్నారు. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని వార్తలు రాయాలి' అని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.