గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంతకు ముందు విలీనం పేరిట ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తరలించారు. తాజాగా పదిమంది కన్నా తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని కూడా సమీప ప్రాంతాల్లోని స్కూళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది. ఈమేరకు ఆయా స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులు సేకరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లో గుబులు రేగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఆ ప్రాథమిక బడుల్లో 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. వాటిని ఫౌండేషన్ స్కూళ్లుగా కొనసాగిస్తామని చెప్పడంతో అప్పట్లో చాలాచోట్ల గ్రామస్థులు మిన్నకుండిపోయారు. కొన్ని గ్రామాల్లో మాత్రం 1-5 తరగతులు కలిగిన ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడానికి వీల్లేదని ఆందోళనలు చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో వాటి జోలికెళ్లలేదు. ప్రస్తుతం అలా మిగిలిపోయిన సూళ్లతోపాటు అసలు ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే వాటిని పూర్తిగా దానికి ఒక కిలోమీటరు లోపు ఉన్న ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.