అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు ఆదేశించారు. అహోబిలంలోని టీటీడీ కల్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని మఠం అధికారులు సంపత్, మేనేజర్ శ్రీనివాసన్, బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి సేతురామన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ భక్తులకు మంచినీరు, వసతి, వైద్యం, రక్షణ, పారిశుధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక అధికారి సేతురామన్ మాట్లాడుతూ.... పారిశుధ్య పనుల నిమిత్తం ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే ఉందని, మరో రెండు వాహనాలు కేటాయించాలని ఆర్డీవోకు విన్నవించారు. అలాగే గ్రామంలో పందుల బెడద ఎక్కువగా ఉందని, వీటిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆర్డీవో సూచించారు. పోలీసులు భక్తుల పట్ల స్నేహ పూర్వకంగా మెలగాలని సూచించారు. భక్తులు అడవిలోకి వెళ్లకుండా, అలాగే మద్యం, తదితర అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని అటవీ, ఎక్సైజ్ అధికారులకు సూచించారు. తెలుగుగంగ అధికారులు కాలువకు నీరు సరఫరా చేస్తే భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఉంటుందని, ఈ సమయంలో ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సూచించారు. వైద్యం, రక్షణ, ఫారెస్టు, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ శాఖల అధికారులు హాజరయ్యారు.