వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర, కాళ్ల పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి.. అర్నే్‌షకుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఎంపీ రఘురామ ప్రోత్సాహంతో ఆయన అనుచరులు రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. శాంతికి భంగం కలిగిస్తున్నారని, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని భూపతి వెంకట శ్రీనివాసరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెనుమంట్ర పోలీసులు ఎంపీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంపై కె.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కాళ్ల పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ రఘురామరాజు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండడంతోనే పిటిషనర్ పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 24న గవర్నర్ ప్రమాణస్వీకారానికి ఆయన రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎంపీ వస్తే పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.