కాయకష్టం చేసి సంపాధించిన ఓ రైతు మాత్రం సంపాధించింది రూ. 2 మాత్రమే. యావత్తుదేశం తలదించుకోవాల్సిన ఘటన ఇది. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది దేశంలో రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక.. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. తాజాగా, ఓ రైతు ఎన్నో ఆశలు నింపుకుని ఉల్లి (Onion) సాగు చేయగా.. తీరా పంట చేతికందే సమయానికి ధరలు పడిపోయాయి. ఐదు క్వింటాలకుపైగా ఉల్లిపాయలను విక్రయించిన రైతుకు.. ఖర్చులన్నీ పోనూ చేతికి రూ.2 వచ్చింది. దేశంలో అన్నదాతల దుస్థితికి అద్దం పట్టే ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
షోలాపూర్ జిల్లా బోరగావ్ గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర చవాన్ (58) ఉల్లి పంటను సాగుచేశారు. తన పొలంలో పండిన ఉల్లిని ఆయన ఫిబ్రవరి 17న షోలాపూర్ మార్కెట్‌కుతీసుకెళ్లారు. ఉల్లిపాయల ధరలు పడిపోవడం వల్ల కిలో రూ.1 చొప్పున కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పారు. గత్యంతరలేక మొత్తం 512 కిలోల ఉల్లిపాయలను రూ.512లకు అమ్మేశారు. పొలం నుంచి పంటను తీసుకొచ్చేందుకు రవాణా, కూలీల ఖర్చు, మార్కెట్‌కు సంబంధించిన ఇతర వ్యయాలు కలిసి మొత్తం రూ.509.51 అయ్యింది. అంటే అతడికి మిగిలింది రూ.2.49. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసిన మార్కెట్ కమిటీ అధికారులు రూ.2 చెక్కును రైతు చేతిలో పెట్టారు. చెక్కుపై కూడా 15 రోజుల తర్వాత బ్యాంకులో జమచేసేలే ముందు తేదీ వేయడం గమనార్హం.
ఉల్లి సాగుచేసిన ఆ రైతుకు కన్నీరే మిగిలింది. పెట్టుబడి ఖర్చులు తడిపిమోపుడవుతుంటే.. పండిన పంటకు కనీస ధర లభించక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. రాజేంద్ర చవాన్ మాట్లాడుతూ.. ‘‘ఉల్లిపాయలు కిలోకు రూపాయి దక్కింది.. మొత్తం 512 కిలోల ఉల్లి అమ్మితే.. రవాణా ఛార్జీలు, లోడింగ్, తూకం సహా ఖర్చుల కోసం రూ.509.50లను ఏపీఎంసీ వ్యాపారులు మినహాయించుకున్నారు. గతేడాది కిలో రూ.20 చొప్పున అమ్మాను.. గత మూడు నాలుగేళ్లలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపయ్యాయి.. అర టన్ను ఉల్లి పండించడానికి రూ.40,000 ఖర్చుపెట్టాను’’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.
రూ.2 పోస్ట్ డేటెడ్ చెక్కు ఇవ్వడం వెనుక లాజిక్‌ను వివరిస్తూ చవాన్ నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేసిన షోలాపూర్ ఏపీఎంసీ వ్యాపారి నాసిర్ ఖలీఫా మాట్లాడుతూ.. ‘రశీదులు, చెక్కుల జారీ ప్రక్రియను కంప్యూటరీకరించాం.. ఫలితంగా చవాన్ చెక్కు పోస్ట్-డేట్ చేయబడింది.. చెక్‌పై ఉన్న మొత్తంతో సంబంధం లేకుండా ఇది సాధారణ పద్ధతి. మేము ఇంతకు ముందు కూడా ఇంత చిన్న మొత్తాల చెక్కులను జారీ చేశాం’ అని అన్నాడు.
‘అతడు తీసుకొచ్చిన ఉల్లిపాయలు నాణ్యత తక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు, చవాన్ కిలో రూ. 18కి విక్రయించే నాణ్యమైన ఉల్లిపాయలను తీసుకువచ్చాడు.. ఇంకో బ్యాచ్ ఉల్లిని తీసుకొచ్చాడని అది కిలోకు రూ. 14 పలుకుతుంది. డిమాండ్ ఉంది’’ ఖలీఫా చెప్పారు.