పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి శుక్రవారం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎ. మల్లికార్జున, ఎన్నికల పరిశీలకులు సిద్దార్థ్ జైన్ సమక్షంలో పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి చివరి రోజు గురువారం నాటికి మొత్తం 44 మంది 70 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
శుక్రవారం అభ్యర్థులు , వారి ఏజెంట్ల సమక్షంలో మొత్తం 70 సెట్లు నామినేషన్లు జిల్లా కలెక్టరు పరిశీలించారు. విశాఖ జిల్లాకు చెందిన ఇమామ్ మోహియుద్దీన్ అహ్మద్, రుద్రరాజు కల్యాణ వర్మ నామినేషన్లను తిరస్కరించారు. విజయనగరం జిల్లాకు చెందిన బొలిశెట్టి వెంకటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన కొలుపురి నాగభారతి నామినేషన్ తిరస్కరించారు. మొత్తం 44 నామినేషన్లకు గాను నాలుగు నామినేషన్లు తిరస్కరించారు. ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది , నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు , వారి ఏజెంట్లు ఉన్నారు.