పాకిస్థాన్ అమ్మాయిలు.. భారత్‌కు చెందిన యువకులను టార్గెట్ చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఓ యువతి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఆమెను గుర్తించిన పోలీసులు.. తిరిగి వెనక్కి పంపారు. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు.. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. భారత అధికారులు వాఘా సరిహద్దు వద్ద ఆమెను పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు.
సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న ఇక్‌రాకు.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ములాయం సింగ్ యాదవ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక్‌రా సెప్టెంబరులో దుబాయ్‌కు చేరుకుని.. అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడ ఆమెను ములాయం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇక్‌రా పేరును రావాగా మార్చి ములాయం ఆధార్ కార్డు తీసుకొని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశాడు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. వారి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వివరాలు సేకరించారు. అసలు విషయం తెలిసి.. ఆమెను ఆదివారం వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులకు అప్పగించారు. ములాయం తన పేరును సమీర్ అన్సారీ అని.. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీరునని అబద్ధం చెప్పాడని.. అది నమ్మిన ఇక్‌రా అక్కడికి వెళ్లిన తరువాత పశ్చాత్తాప పడేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. ఇక్‌రానే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని.. అంటున్నాడు ములాయం సింగ్ యాదవ్.