కాలనుగుణంగా అడుగులేస్తున్న టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి తాటాకు బుట్టలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈవో ధర్మారెడ్డి పలు రకాల బుట్టల్ని పరిశీలించారు. ఈ నిర్ణయంతో ప్రకృతి పరిరక్షణతో పాటూ పలువురికి ఉపాధి కల్పించినట్లవుతుందని టీటీడీ ఆలోచ చేస్తోంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి సంబంధించి టీటీడీ ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. లడ్డూ విక్రయ కేంద్రాల పెంపుతో పాటూ ప్రసాదం తయారీ కోసం ఆత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తోంది.
తిరుమలలో రోజుకు ఆరు లక్షల లడ్డూల తయారీకి వీలుగా ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్‌ల అవసరం ఉండదు. ఈ యంత్రాలను స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు తగినంత స్థాయిలో లడ్డూలు వేగంగా సిద్దం చేయటానికి అవకాశం ఏర్పుడుతందంటున్నారు. నాణ్యత విషయంలో కూడా రాజీ ఉండదు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ యంత్రాలను తీసుకొస్తోంది.
ఇటు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళ పత్రాల డిజిటైజ్ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్వీ గోసంరక్షణ శాలలో నిర్మిస్తున్న నెయ్యి తయారీ ప్లాంట్ భవనాలు, యంత్రాల ఏర్పాటు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ శాస్త్రాన్ని, అందులో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రసారం చేసిన యోగ దర్శనం కార్యక్రమానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు. యోగ వల్ల కలిగే ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతను వివరించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
ఇంకా వెలుగులోకి రాని తాళపత్రాలను స్కానింగ్ చేసే ప్రక్రియను వేద విశ్వవిద్యాలయం వేగవంతం చేయాలన్నారు. ఎస్వీబీసి యూట్యూబ్ లో ఆరోగ్యం, ఆహారం, జ్ఞానం, విజ్ఞానానికి సంబంధించి అంశాలపై నిపుణుల చేత ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలన్నారు. టీటీడీలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరగా ఖరారు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఈవో చెప్పారు. తిరుమలలో ఉద్యానవనాల నిర్వహణ మరింత ఆకర్షణీయంగా ఉండాలని, కొత్తగా ఉద్యానవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమి చదును కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బర్డ్ ఆసుపత్రిలో స్మైల్ ట్రైన్, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను ప్రజలకు మరింత చేరువ చేయాలని శ్రీ ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రవణం ప్రాజెక్టును ఇకపై బర్డ్ ద్వారా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.