దక్షిణాదిలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కిలో రూ.200 గరిష్ఠ ధర లభించింది. గత ఏడాది రూ.185తో కొనుగోళ్లు ప్రారంభించిన వ్యాపారులు ఈ ఏడాది రైతుల విజ్ఞప్తి, బోర్డు అధికారుల సూచనతో రూ.200తో ప్రారంభించారు. గతంలో వేలం ప్రక్రియ కొనసాగే క్రమంలో డిమాండ్ ప్రకారం గరిష్ఠ ధర కిలోకు రూ.237 వరకు ఈ ప్రాంతంలో పలికింది. అయితే వేలం ప్రారంభం రోజున కిలో రూ.200 లభించడం ఇదే ప్రథమం. ఒంగోలు కేంద్రంగా ఉన్న రెండు రీజియన్లలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 11 వేలంకేంద్రాలు ఉన్నాయి. గతేడాది 76.57 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు ఈ ప్రాంతంలో జరగ్గా కిలోకు సగటున రూ.172.49 ధర లభించింది. ప్రస్తుత సీజన్‌కు 87.11 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించగా పలు కారణాలతో పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగింది. సుమారు 101.40 మిలియన్ కిలోలు ఉత్పత్తి జరిగినట్లు బోర్డు అధికారుల అంచనా.