మనదేశంలో ప్రతి రోజు ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాల గురించి వింటున్నాం, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా 12 మంది మృతిచెందారు. బోల్దా బజార్ జిల్లా భాతాపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. దీంతో వ్యాన్‌లోని ఉన్నవారు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలిలోనే 11 మంది మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఓ వేడుకకు హాజరై తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
భాతాపరా డీఎస్పీ సిద్ధార్థ బాఘేలా మాట్లాడుతూ.. బాధితులు అర్జునిలో ఓ వేడుకకు వ్యాన్‌లో వెళ్లి తిరిగొస్తుండగా భారీ ట్రక్కు ఢీకొట్టిందని తెలిపారు. ఘటన గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. స్థానికుల సాయంతో బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వ్యాన్‌ను ట్రక్కు బలంగా ఢీకొట్టడం వల్ల ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో పలువురు అందులో చిక్కుకుని తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. అతికష్టంమీద వీరిని బయటకు తీశారు. ఇటీవల కాంకేర్ జిల్లాలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తోన్న ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే.