సినిమా తరహాలో హత్యలు చేసి క్లైమెక్స్ లో దొరికిపోయినట్లుగా దొరికిపోతున్నారు నింధితులు. తాజాగా ఓ కేసు ఇలాంటిదే చోటుచేసుకొంది. ఓ మహిళ స్నేహితులతో కలిసి భర్తను, అత్తను హత్య చేసి.. వారి మృతదేహాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. అనంతరం పొరుగు రాష్ట్రంలోకి తీసుకెళ్లి అక్కడ లోయలో విసిరేసింది. అత్యంత భయంకరమైన ఈ ఘటన అసోంలో గతేడాది చోటుచేసుకోగా.. ఏడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గువాహటిలో చోటుచేసుకున్న ఈ జంట హత్యలకు సంబంధించి కొన్ని శరీర భాగాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గువాహటికి చెందిన అమర్‌జ్యోతి డే, వందన కలితలది ప్రేమ వివాహం. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరికి అమర్ తల్లి శంకరీ డే ఆర్థికసాయం చేశారు. కొన్నాళ్లు సాఫీగా సాగినా.. ఆమె నుంచి ఆర్ధిక సాయం ఆగిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో వందన జిమ్‌లో శిక్షకురాలిగా చేరారు.
ఈ క్రమంలో తన భర్త, అత్తలు కనిపించడం లేదంటూ గత సెప్టెంబరులో పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులను అమరేంద్ర బంధువు ఒకరు సంప్రదించి.. అత్త శంకరీ డే బ్యాంకు ఖాతా నుంచి వందన డబ్బులు డ్రా చేసిందని ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కళ్లుబైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. తన స్నేహితులతో కలిసి భర్త, అత్తలను ఆమే హత్య చేసినట్టు వెల్లడయ్యింది.
ఇద్దర్నీ చంపాలని నిర్ణయించుకున్న వందన.. ఇందుకోసం తన స్నేహితులు ధంతీ దేకా, అరూప్ దేకాలను సంప్రదించింది. ముగ్గురూ కలిసి తొలుత జులై 26న శంకరీ డేను తన ఇంట్లోనే హతమార్చి, మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోశారు. వాటిని మేఘాలయ తీసుకెళ్లి ఓ రోజంతా అక్కడ తిరుగుతూ వివిధ ప్రదేశాల్లో పడేశారు. అనంతరం ఆగస్టు 17న అమర్‌ను రాడ్డుతో కొట్టి చంపారు. అతడి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. ఆగస్టు 21న మళ్లీ మేఘాలయలోని ద్వాకీ ప్రాంతానికి వెళ్లి వాటిని అక్కడ పడేసినట్టు విచారణలో వెల్లడించారు.
నిందితుల్ని వెంటబెట్టుకుని మేఘాలయకు వెళ్లిన అసోం పోలీసులు.. ఆదివారం గాలింపు చేపట్టారు. చిరపుంజిలో కొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి. మిగతా వాటి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వందనతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హత్యల వెనుక కారణం తెలియాల్సి ఉందని, భర్త తనను హింసించేవాడని, జులాయిగా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసగా మారినట్టు నిందితురాలు చెబుతోందని అన్నారు.