మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. మనుషులు సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తిస్తున్నారు. తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడు, అతడి స్నేహితుల సహకారంతో కట్టుకున్నవాడ్ని హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఓ నర్సు. చివరకు భర్త తండ్రి అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. భర్త ముఖంపై ప్రియుడు, ఆమె కలిసి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారని నమ్మించడానికి సీలింగ్‌కు ఉరేశారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుత్తణికి చెందిన గాయత్రి (25), యువరాజ్ (29) భార్యాభర్తలు. గాయత్రి నర్సుగా పనిచేస్తుండగా.. కార్ల యాక్సెసరీస్ తయారీ పరిశ్రమలో యువరాజ్ పనిచేస్తున్నారు.
వివాహానికి ముందే గాయత్రి తన బ్యాచ్‌మెట్ శ్రీనివాసన్‌ను ప్రేమించింది. అయితే, తల్లిదండ్రుల ఆమెకు తమ బంధువైన యువరాజ్‌తో వివాహం జరిపించారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న గాయత్రి.. తన ప్రియుడ్ని మరిచిపోలేకపోయింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ తమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే, ఇటీవల ఈ విషయం యువరాజ్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు. తన సంబంధం గురించి భర్తకు తెలిసిపోవడం యువరాజ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అతడ్ని చంపి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసింది.
గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాసన్‌లు యువరాజ్ హత్యకు ప్లాన్ చేసి.. , తన స్నేహితులు హేమనాథన్, మణికందన్‌ల సాయం తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం సోమవారం రాత్రి యువరాజ్ ఆఫీసు నుంచి తిరిగి రావడానికి ముందే ప్రియుడు, అతడ్ని స్నేహితులు వారి ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికి యువరాజ్ రాగా.. అతడిపై వెనుక నుంచి దాడిచేశారు. బెడ్‌పైకి తోసేయగా.. హేమంత్, మణికందన్‌లు కాళ్లు పట్టుకోగా.. గాయత్రి, శ్రీనివాసన్‌లు దిండుతో ముఖం గట్టి అదిమి ఊపిరాడకుండా చేశారు. చనిపోయాడని నిర్దారించుకున్న అనంతరం తాడుతో సీలింగ్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మబలికారు.
యువరాజ్ తండ్రికి ఫోన్ చేసిన గాయత్రి.. తాను నిద్రపోతున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. కోడలి మాటలపై నమ్మకం కలగకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించారు. అతడి కాళ్లు, చేతులపై గాయాల గుర్తులు ఉండటంతో ఇది ఆత్మహత్య కాదని భావించారు. అప్పటికి కూడా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని గాయత్రి బుకాయించింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చివరకు తామే చంపినట్టు ఒప్పుకుంది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. గాయత్రిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు శ్రీనివాసన్, హత్యకు సహకరించిన అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.