ఇంటా...బయట మహిళలకు భద్రత లేదని చెప్పడానికి ఈ ఘటనయే ఓ ఉదాహరణ, 14 ఏళ్ల బాలికపై ఆమె సవతి తండ్రి అత్యాచారం చేశాడు. 45 ఏళ్ల నిందితుడు గత ఏడాది నవంబర్ నుంచి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 13న బాలిక కడుపునొప్పితో బాధ పడుతుండటంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ సోనోగ్రఫీ నిర్వహించిన వైద్యులు బాలిక రెండు నెలల గర్భవతి అని చెప్పారు. అది విని బాలిక తల్లి షాక్‌కు గురైంది. కుమార్తెను ప్రశ్నించగా తనపై జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పుకొని బోరుమంది.
ఆ మహిళ మొదటి భర్త ఆమెను విడిచిపెట్టడంతో నిందితుడు దాదాపు ఐదేళ్ల కిందట ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భర్తతో ఆమెకు జన్మించిన బాలికపై కన్నేశాడు. గతేడాది నవంబర్ నుంచి సవతి తండ్రి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మైనర్ బాలిక తన తల్లికి తెలిపింది. అయితే, ఈ దారుణం తెలిసినా.. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, ఆమెను పరీక్షించిన వైద్యురాలు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు విచారణ నిమిత్తం బాలిక ఇంటికి చేరుకోగా.. ఆ సమయంలో ఆమె పాఠశాలకు వెళ్లింది. అదే సమయంలో పోలీసులు తమ ఇంటికి వచ్చారని భర్తకు సమాచారం అందించింది ఆమె తల్లి. దీంతో నిందితుడు పరారయ్యాడు. అతడి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పోలీసులు అతడి రెండో నంబర్‌ను గుర్తించారు. ఆ నంబర్ వాడుతున్న ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని ట్రాక్ చేశారు. 24 గంటల్లోపే అతడిని అరెస్టు చేశారు.