ఐటీ అధికార్లమంటూ ఓ ఇంట్లో దూరి మహిళను బెదిరించి కొందరు దుండగులు దోపిడికి పాల్పడ్డారు. గుంటూరులోని ప్రగతి నగర్‌లో అదాయ పన్ను (ఐటీ) అధికారుల పేరుతో జరిగిన ఈ దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకోగా మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో రూ. 50 లక్షల నగదు చోరీకి గురి కాగా.. నిందితుల నుంచి రూ. 48.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అర కేజీ బంగారానికి గాను 132 గ్రాముల బంగారం రికవరీ చేశారు.
ఈ కేసు వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ శ్రీనివాస్, సుప్రజ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగంశెట్టి కల్యాణి అనే మహిళ చాలా కాలం నుంచి ఉన్నత కుటుంబానికి చెందిన దొడ్డ ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో పని చేస్తోంది. ప్రసాద్‌కు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే, కల్యాణి ఇంట్లో అయితే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఆమె ఇంట్లో దాచుకున్నాడు.
అయితే, ఎంత బంగారం, ఎన్ని నగలు ఉన్నాయనే విషయం కల్యాణికి కూడా తెలియదు. ఈ క్రమంలో ట్రంకు పెట్టెలో, బియ్యం డబ్బాలో ఆమె భద్ర పరిచారు. కల్యాణి ఇంట్లో డబ్బులు ఉన్నాయని సమీపంలో నివసించే ఏసుబాబు, జాన్‌బాబుకు తెలిసింది. ఈ డబ్బులు, బంగారం ఎలా దోచుకోవాలా అని ఆ ఇద్దరూ పక్కాగా ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో బండ్లమూడి సురేష్, విజయ్ కుమార్‌తో కలిసి ఏసుబాబు, జాన్‌బుబు ఐటీ అధికారులమని చెప్పి కల్యాణి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బెదిరించి డబ్బు, బంగారం తీసుకెళ్లారు. కల్యాణి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా స్టోరేజీ పాయింట్‌ను కూడా తీసుకొని వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు. సాంకేతికత సాయంతో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు.