పాతికేళ్లనాటి లంచం కేసు ఓ ఎంపీడీవోకు శాపంగా వెంటాడింది. రూ.5 వేల కోసం ఓ ఎంపీడీవో పడిన కక్కుర్తి.. పాతికేళ్ల తర్వాత కూడా ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. 80 ఏళ్ల వయసులో ఆయన జెలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. తను వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని మొరపెట్టుకున్నా సరే.. హైకోర్టు కనికరించలేదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ కేసు పుర్వాపరాల్లోకి వెళ్తే..
ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం.. నడిమ హెడ్ మాస్టర్ బాధ్యతలు తనకు అప్పగించాలని.. జీతం బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని.. యూవీ శేషారావు అనే ప్రధానోపాధ్యాయుడు 1998లో తిరువూరు ఎంపీడీవోగా ఉన్న బత్తిన వెంకటేశ్వరరావును అభ్యర్థించారు. అలా చేయాలంటే తనకు రూ.5 వేలు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్ చేశారు. దీంతో సదరు హెడ్ మాస్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
1998 ఏప్రిల్‌లో ఎంపీడీవో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఏసీబీ కోర్టు 2005లో ఎంపీడీవోను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఏసీబీ 2007లో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. ఇన్నాళ్లపాటు హైకోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నాటి ఎంపీడీవో అయిన బత్తిన వెంకటేశ్వర రావును దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం.. జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-7 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా.. సెక్షన్ 13(1)(డీ) ప్రకారం ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించిన హైకోర్టు.. రెండు శిక్షలను ఏక కాలంలో అనుభవించాలని ఆదేశించింది. జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ఈ మేరకు తీర్పు వెలువరించారు.