షాపుల తొలగింపుతో మొదలైన వ్యవహారం కాస్త సీఐ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్స సందర్భంగా.. ఆలయం చుట్టు పక్కల ఉన్న షాపుల తొలగింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. అకస్మత్తుగా తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ వారికి అండగా నిలిచారు. పూర్తిగా అడ్డం ఉన్న షాపులను మాత్రమే తొలగించాలని కోరారు. కానీ ఆలయాధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే సీఐ మధు అక్కడికి చేరుకొని టీడీపీ వర్గీయులను అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ మధ్య మాటా మాటా పెరిగింది. చెన్నై జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఐ మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషించడంతో కదిరిలో ఉద్రిక్తతలు తలెత్తాయి. సీఐ మధు ఇంటి వద్ద టీడీపీ మహిళా విభాగం ధర్నా చేపట్టగా.. నియోజకవర్గ ఇంచార్జ్ వారికి మద్దతుగా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అధికార పార్టీ నాయకులు కొందరు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు సీఐను భుజాలపైకి ఎత్తుకోగా.. ఆయన మీసం మెలేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పట్ల టీడీపీ మండిపడింది. ఓ సందర్భంలో సీఐను కొందరు వ్యక్తులు భుజాలకెత్తుకోగా.. ఆయన మీసం మెలేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పట్ల టీడీపీ మండిపడింది.
పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో తమ వాళ్లు చాలా మంది గాయపడ్డారని టీడీపీ చెబుతోంది. కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పరామర్శించారు. కదిరి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా బలగాల మోహరించాయి. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ కదిరిలో పర్యటించనున్నారు.