ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు దోపిడీకి గురవతున్నారని, కార్పొరేట్ల మేలు కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా సీపీఎం నాయకులు సభ నిర్వహించారు. సీపీఎంలో చేరిన స్థానికులను బాబూరావు ఆహ్వానించారు. రూ.13 లక్షల కోట్లు సామాన్య ప్రజానీకం నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తే కార్పొరేట్ల నుంచి కేవలం రూ.9 లక్షల కోట్లే వసూలు చేస్తున్నారని బాబూరావు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా రూ.61 వేల కోట్లు గడించారన్నారు. ప్రజల సొమ్మును, ఆస్తిని అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పచెబుతున్నారని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో కానీ, కృష్ణలంకలో కానీ కమ్యూనిస్టుల హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. మురుగు నీటితో మునిగిపోయే కృష్ణలంకను సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసింది కమ్యూనిస్టులేనన్నారు. సీపీఎం విధానాలు నచ్చి 35 మంది కుటుంబాలతో సహా పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. బోజెడ్ల నాగేశ్వరరావు, పుప్పాల కృష్ణ, బత్తుల చిన్నారావు, కోరాడ రమణ, తమ్మిన చంద్రశేఖర్, కె.శివాజీ, వి.గోపి, కుమార్, లక్ష్మణకుమార్ పాల్గొన్నారు.