యువగళం పాదయాత్ర 28వ రోజైన ఆదివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండల పరిధిలోని భాగ్యనగర్‌లో ఆయన బీసీలతో సమావేశమయ్యారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసింది చంద్రబాబేనన్నారు. తమ ప్రభుత్వంలో వన్నె కాపులకు చైర్మన్, మేయర్లుగా అవకాశం ఇచ్చామన్నారు. తుడా చైర్మన్, టీటీడీ, ఏపీఐఐసీ చైర్మన్ పదవులతో పాటు ఆర్థిక మంత్రి పదవి కూడా యాదవులకు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పదవులన్నీ ఎవరికిచ్చిందో యాదవులే ఆలోచించాలన్నారు. తిరుపతి మేయర్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన చెల్లెలు ఉన్నా.. ఆమెను పనిచేయనీకుండా ఎమ్మెల్యే కొడుకు అభినయ్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.